Thursday, March 18, 2010


కళ్ళ కొసల్లో వేలాడే
భాష్పాలు చారికలుగా అంటుకుపోయేది
చితికిన మనసు నెర్ర
నెర్రలుగా చెక్కుకుని మూలుగుతుండేది

రవ్వంత ప్రేమతునక
ఎదురుగా వేలాడితే చాలు
ఛిద్రమైన గుండె తన
ఒడిని ఒళ్ళంత పరిచేది

ఆశలొదిలేసిన ఈ హృదయం
అప్పుడప్పుడు ఊపిరివేళ్ళను
తడుపుతూ బతుకునీడుస్తుండేది
సరిగ్గా అప్పుడే-

ఒక్కొక్కటిగా రాలుతున్న శిశిరంపై
వెచ్చని వసంతంలా పరుచుకున్నావు
లాలిత్యం ఆశించని బతుకుకి
లాలిపాటని అందించావు

కూలబడిన ప్రతీచోటాల్లా
నడక వీడిన ఆ దారంటా
నడి వేడిమిలో పూలు పరిచావు
సడి రాతిరిలో జాబిలివయ్యావు
వడి వడిగా వెన్నెల గుత్తులై
నా జీవితంలో విరబూసావు

ఆశల లతని పాదు చేస్తూ
అనుక్షణం నన్నల్లుకుపోతు
మంచు తుషారమై కురిసావు

నీ ప్రేమ సముద్రమని తలచి
జోగాడే పడవనై ఒదిగిపోయాను
ఆత్మీయత పంచుతూ సుతారంగ
నా మనసు మీటుతుంటే కమ్మని
వీణ పాటై కరిగిపోయాను

పంచుకున్న కలలు కల్లలని
కాలం వాటిని రక్కిపోతుందని
ఒకదానితో ఒకటి పెనవేసుకున్న
మనసులను అమాంతంగా నువ్వు
విడదీస్తే, తట్టుకోలేని నా చిన్ని
గుండె నెత్తుటి జడులు విదుల్చుతుంది

ప్రేమని చంపి స్నేహితులమని
మనసుని మాయ చేయడం నీకు
తగునేమో, అయినా -
స్నేహమాంటే ఇష్టమని
ఇష్టమంటే ప్రేమని
ప్రేమంటే నువ్వని
నువ్వంటే ప్రాణమని
నీకు చెబుదామనుకున్నాను
కాని -
నీ సమక్షంలోనే నువ్వు
అలక్ష్యం చేస్తుంటే నా
యద కవాటాలు చెల్లా-
చెదురుగా గాల్లోనే చీలిక
పీలికలై పిడచకట్టుకుపోయాయి

బీడు గుండెని నిమరలేని
మొండి చెయ్యిగా, శాశ్వతంగా
మిగిలిపోయావు నా పట్ల

1 comment:

Anonymous said...

వామ్మో! ఏం మాయ చేశారో? ఈ కవిత్వంతో నాకు కళ్ళు బైర్లు కమ్మినాయి. ఒళ్ళు పచ్చడై పోయింది. సుయిసైడ్ చేసుకోవాలనిపిస్తుంది.