Friday, May 8, 2009

పయనం.. ఒంటరి పయనం


కాల చక్రం..
నజ్జవుతున్న బ్రతుకు దొంతరలు ..
పులిమిన కృత్రిమ నవ్వులు
అడుగు జాడల్లెని అడవి
చీకటి, గడిపిన ఆ కొద్ది క్షణాల భారాన్నీ
మోసుకుంటూ.. కాళ్ళీడుస్తూ..
ఒంటరి పయనం...
సుడిగాలిలా..
అంతరాళాల్లోనించి
ఆలోచనల్లో బహిర్గతమవుతావు
ప్రతి పలకరింపూ ఓ తీయని వేటు ..
గుండె ముక్కలు పొదివి పట్టుకుని
ఓ అజ్ఞాతగా.. నన్ను
మోసం చేసుకుంటూ.. తడబడుతూ..
గమ్యమెరుగని ప్రయాణం
మరచాననుకుంటూ..ఏమరుచుకుంటూ..
అలలా వీడలేక.. కలలా మిగలలేక..
బ్రతుకీడుస్తూ..
పయనం.. ఒంటరి పయనం !
Note : నే వ్రాసిన వెళ్ళిపో నేస్తానికి తన స్పందన గా తన మాటలలో పదాలలో దానిని ఇంకొంచెం భావాన్ని అద్ది సున్నింతంగ స్పృశించి తనదైన శైలిలో మెరుగుపరిచి నాకందిచిన ఆత్రేయగారికి (http://aatreya-kavitalu.blogspot.com) ప్రత్యేక ధన్యవాదాలు.

Saturday, May 2, 2009

వెళ్ళిపో నేస్తమా

నిన్ను మర్చిపోయాను
యాంత్రిక జీవనంలో
బతుకు పోరాటం సాగిస్తూ
నీ జ్ఞ్యాపకాల దొంతరలను
అణిచివేసాను
కృత్రిమ నవ్వుల్ని పులుముకుని
ముఖస్తుతి మాటలు కలుపుతూ
అడుగు జాడల్లేని అడివిలో
ఒంటరిగా కబుర్లు చెబుతున్నా
నీతో గడిపింది
కొద్ది క్షణాలే అయినా
నాతో పాటు అవి
తోడుగా వస్తూనే ఉన్నాయి
ఏదో ప్రవాహం ఛుట్టుముడుతుంది
అలలతో పాటు అట్టడుగుకి వెళ్తావు
కడలి వలే పొంగుతూ
మరలా సుతిమెత్తగా తాకుతావు
ఏం చెప్పేది
నీ ఒక్కో పలకరింపు
నన్ను బాధించిన వైనం
నీ కన్నీరొలికినా
ఏమి చేయలేని చేతకానితనం!
వెళ్తూ వెళ్తూ
గుండెని సగం కోసి పోయావు
ఇంకో సగం మిగిలిందనా
నలిపేయడానికి తిరిగొచ్చావు?
నీ చాయలు నాపై
ఇకలేవని మొండిగా వాదిస్తానే కాని
అలా నన్ను నెను
మోసం చేసుకుంటున్నాను, తెలుసా?
నిజం చెప్పాలంటే
నిను మర్చిపోతున్నాననుకున్నాను
కాని, ఎంత ప్రయత్నించినా
నిను మర్చిపోలేకున్నాను !!