Monday, January 26, 2009

తిరిగొచ్చిన శిశిరం

మానుననే అనుకున్నాను
మోడువారిపోయి ఉన్నాను
ఆశల రెక్కలన్నీనేల రాలగా
జ్ఙ్యాపకంగా బరువుతో కృశించిపోతున్నాను.
తూరుపు తెలవారుతూండగా
లీలగా తాకిన ఏదో స్పందనగా
మనసత్వాలలో కొత్త వసంతంలా చేరి నిండిపోయావు.
నీ చిర్రుబుర్రు మాటలతో
అల్లరి కోపాలతో
గ్రీష్మమై నాకు ఊపిరి పోస్తు వచ్చావు
నీ ప్రతీ నవ్వు నాకు అందిస్తూ
ఆనందాన్ని రుచి చూపిస్తూ
శరదృతువై నా కన్నీటిని తుడిపేసావు
నన్ను నేను తెలుసుకోగా
నీకు నే దగ్గరవగా
నిన్ను నాలో దాచేయగా
హేమంతానివై పూర్తిగా ఒదిగిపోయావు.
నిన్ను నా చెంత చూసి
తారలన్ని చూపు తిప్పగా
రమణీయ రాగాలలో
నీ కబుర్లన్నీ ఆలకిస్తున్న వేళ
చిన్నబోయిన వెన్నెలంతా
నల్ల మబ్బు చాటు చేరి తుఫాను రేపింది.
కాలమంతా రెప్పపాటులో సాగిపోగా
మునుపటి ఏకాంతం మరల చేరగా
వెచ్చని నా కన్నీళ్ళు మంచుపొరని కరిగించగా
తిరిగొచ్చిన ఈ శిశిరంలో
చిగురించిన ఎడబాటుని నాకు జతచేసి
మరుపురాని జ్ఙ్యాపకంగా మిగిలిపోయి
నన్నొదిలిపోయావు!!