Monday, December 8, 2008

కలవని రేఖలు

వృక్షం ఒకటే
చెరోవైపు ఎదిగిన కొమ్మలం
ఒకటవాలనుకున్న చుట్టపట్టాలం
సాంప్రదాయ దారాలలో
ఇరుక్కున్న చకోరులం
ప్రయాణం ఒకటే
చేరాల్సిన మజిలీలు వేరు
వీడలేక నువ్వొదిగిన తీరు
నాలో మెదిలే కొద్ది
రాలుతుంది కన్నీరు
ఆత్మ ఒక్కటే
ఎన్నటికి ఇక కలవలేము
నను మరిచిపోతూ నువ్వూ
నిను మరవలేక నేను
మరో తొటలో నిలువలేము
తపస్సు ఒక్కట
కలవని చూపుకి నిదురరాదు
వెన్నల నెలవంక పలకరించదు
నన్ను తాకని ఉషస్సులో
నా జీవితం తెలవారదు
కోరేది ఒక్కటే
అల్లల్లాడిన ప్రాణం అంతమైనప్పుడు
నేల రాలిన ప్రేమ కుసుమం
నే దోసిట పట్టుకుని
నిన్ను నేనూ చేరడం.

Sunday, November 23, 2008

తరగని విరహం

నా కళ్ళ ముందర చెదిరిపోని నీ రూపం
ఈ చిన్ని గుండెలో రేపిన అలజడి ఎంతో తెలుసా?
వెన్నెల నీడలో ఆవిరైన కన్నీళ్ళు, మేఘమై
వర్షినట్టుగా, మనసు నిండా ఒరిగాయి.
కాలమెంత గడిచినా నీ స్మ్రుతులన్నీ వెన్నంటే
నిలవగా, నెమరేసుకుంటూ నే అల్లినా గీతాలు ఎన్నో!
అయినా -
ఎంత కవిత్వం రాసినా ఈ విరహం తరగదెందుకో!!

Tuesday, November 18, 2008

నువ్వు - నేను

అక్కడెక్కడో నువ్వు
ఒంటరిగా నేను
మదిలో మెదులుతావు నువ్వు
నీకోసం ఆరాటపడతాను నేను
వెచ్చని తలపువై మండిస్తావు నువ్వు
అమర ప్రేమనై వర్షిస్తాను నేను
గాలివై వచ్చి కదిలిస్తావు నువ్వు
అలుపెరుగక ప్రవహిస్తాను నేను
సౌందర్యం నింపుకున్న సాగరం నువ్వు
ఆనందం పొందుతున్న తరంగం నేను
నా కవిత సృష్టించిన ప్రకృతి నువ్వు
తన్మయత్వం నిండిన ప్రణయంతో నేను
అక్కడెక్కడో నువ్వు
కలుస్తామన్న ఆశతో నేను

Monday, October 6, 2008

ఓదార్పు

మునుపటి కన్నా చేదుగా వచ్చిన
ఈ గ్రీషం కూడా నాకు తోడు లేకుండాపోయింది!
శరదృతువులోని ప్రతీ చినుకు నను తడుపుతూ
నా కన్నీరుని తుడుస్తుంది కాని, ఏ గాలీ
నను చేరదేం!! అయినా, ఆ నింగిలో ఎన్ని
మబ్బులున్నా, ఏ మేఘము నను ఓదార్చదెందుకని!
మండే ఎండకి, పడే వానకి, వీచే గాలికి -
వెలుగుని కమ్మే నిశికి, వేకువఝాము మౌనానికి -
అన్నిటికి తెలుసు. నేను ఎవరితోను ఏది పంచుకోనని!
అయినా, ఎందుకనో ఒక్కోసారి ఆరాటపడతాను.
'ఎవరన్నా నా మౌనానికి సాక్షి గావాలని'!

Saturday, October 4, 2008

నీతోడు కావాలి

ఆ కారుమబ్బుల చాటున
నేను మౌనంగా ఏడ్చాను.
ప్రతీ క్షణం
తన ధ్యాసలోనే గడిపాను.
కనుమరుగవుతుంటే వెంటబడుతూ
నిస్సహాయుడనై కూలబడ్డాను.
గుండె నిండా పేరుకున్న బాధ
కన్నీరై వెల్లువలా చుట్టుముడుతూంది.
ఓ మనసా! నేను ప్రయాణించాల్సింది ఎంత ఉందో!
చేరాల్సిన మజిలి ఏ దిక్కున వుందో!!
కనుక తన జ్ఙ్యాపకాలు వీడిపోనీకు!
నా కంట కన్నీరు ఇంకనివ్వకు!!

Friday, October 3, 2008

నా ఆశకి శ్వాసవి నువ్వు

నా నవ్వులు నీకు పంచాలని
నా కలలో నిన్నే చూడాలని
చుక్కలన్ని నీ ముంగిట దింపాలని
నా ప్రతీ పదము నీకె అంకితమివ్వాలని
నా సంతోషం లో నువ్వే నిండి ఉండాలని
నీ చిరునవ్వులో నీ పెదవి వొంపునవ్వాలని
ఎనాటికీ నిన్ను వీడిపొవద్దని
నా మనసుని నీకే అర్పించాలని
నీతోనే కలిసి పయనించే బాటసారిని కావాలని
నీ కోరికలో ప్రేమనై
నీ ప్రేమలో స్వార్ధమై
నీ కళ్ళలో ప్రతీ రూపాన్నై
నీ గుండెలో గానమై
నీ అడుగులో ధూళినై
నీ మాటల్లో పలుకునై
నీ చూపులో వెలుగునై
నీ కవితలో భావన్నై
నీ మేనికి ఛాయనై
నీ వెంట నీడనై
నీ ఆశకి బదులవ్వనా...
నా శ్వాసలో నిన్ను దాచేయనా!!!

Monday, September 1, 2008

నువ్వంతా విషాదమే!!

నీకు తెలుసా?
నిన్న నిశి రాతిరిలో నేను ఒంటరిగా ఉన్నవేళ
నీ అలోచనలు నా ఎద నిండా కమ్ముకున్నాయి.
మరలి పొమ్మని ఎంత చెప్పినా వినలేదు కాని -
ఏ ఆనందము మిగిల్చని నువ్వు
విషాదంలోనూ ఆనందిస్తున్నానని తెలుసుకున్నావేమో!
ఈసారి దాని నుండి కూడా నన్ను వేరు చేసావు!!
నువ్వంతా విషాదమే తుషారమా!!

Friday, August 22, 2008

గెలిచానా?? ఓడానా??

ఈ పోరాటం లో నేను ఓడిపోయి
నిన్నుచేజార్చుకున్నాను
నేనే గెలిచానని కాలం నన్ను గేలిచేస్తుంటే
నిన్ను నా నుంచి కాజేయగలిగింది కాని
నీ జ్ఞ్యాపకాలని మాత్రం
చెరిపేయలేకపోయిందని గుర్తుచేసాను
మనసు చెప్పింది - నేనే గెలిచానని!
నీ జ్యాపకాలైతె నా దగ్గర ఉన్నాయి కాని
నువ్వు మాత్రం లేవు
జీవితం చెప్పింది - నేను ఓడానని !!!

Friday, August 15, 2008

డ్రీమ్ గర్ల్

నిండు పున్నమి అందంగా జారే వేళ,
నేలకి తాకే ఆనందంలో -
రివ్వున దూసుకువస్తున్న నీటి బిందువు
గాలి తిమ్మెరతో రమిస్తూ ఆవిరవుతూందెందుకని?
ఏవో ఊహల సమూహాల నడుమ -
అందంగా కదలాడే నువ్వు
నీ అందెల సవ్వడి నా హృదయానికి చేరేలోపు
స్వప్నంగా మిగిలిపోతావెందుకని?
నిదురలో లిప్తపాటు కలిగే ఈ ఆనందాన్ని
సాక్షాత్కరించలేక కంటిపాప కసురుతూంటే
ఆ విసురు నీకు చేరదేం!
నువ్వు మనస్సుకి మాత్రమే అందే భావానివా??
నిన్నెలా చిత్రించను!!
ఒళ్ళంతా తడిసిన బట్టలతో
క్రీగంట చూసే తరుణిలో నీ అందాన్ని చూడనా!
పలికే కోయిల గొంతుతో నీ కంఠానికి నునుపుతేనా!!
పురివిప్పె నడయాడే నెమలి
వయ్యరాన్ని తెచ్చి, నేను ముద్రించనా!
మంచు తెరల చాటున -
అరువు తెచ్చిన రవి కుంచెతో,
కదిలే సీతాకోకచిలుకలోని రంగులన్ని అద్ది,
లాలిత్య రేఖలతో నిన్నూహించనా!!

Sunday, August 3, 2008

దాగని ప్రేమ

ఓ వేసవి సాయంత్రం -
హేమంతంలో మనం కలుసుకున్న
సంధ్య గుర్తువచ్చింది.
ఆ రోజు -
నీకోసం మన ప్రేమని రహస్యంగ ఉంచమన్నావు
గడిపిన మధుర క్షణాలను మర్చిపోమన్నావు
అదే ఇప్పుడు దహించివేస్తుంటే
నా గొంతు మూగబోతుంది.
అందరూ చేరి ఏమైందని అడుగుతున్నా
మౌనమే రజ్యమేలుతుంది.
అయినా సరే -
ఇంత నిశ్శబ్దంలోనూ నా గుండె చప్పుడు
చాలానే చెప్పింది వాళ్ళకి!!

Wednesday, July 23, 2008

పొస్సెస్సివ్ ప్రేమ

నా ప్రేమలో - స్వార్థముందని నువ్వు భావిస్తే నా తపనలో - లోపముందని నీకు తోచితే, నా మనస్సులో - ఉక్రోషమున్నదని నీకు అనిపిస్తే, ఆ తలపే - మన మధ్య దూరనికి కారణమైతే - ఇక నిన్నేది అడగను. నేనేది పట్టించుకోను. ప్రశ్నలతో వేదించను. నువ్వు ఎటువెళ్ళినా - నువ్వేం చేసినా - ఎవరితో మాట్లాడినా - 'పార్టి ' కి వెళ్ళినా - స్నేహితులతో 'ఛాటింగ్ ' చేసినా - బంధువులతో 'సినిమా ' కి వెళ్ళినా - 'ఫోను ' లో ఎంతసేపు మాట్లాడినా - నాకిష్టంలేని పనిజేసినా - నా సమక్షంలో - నన్ను మరిచినా, నా పరోక్షంలో - నువ్వు హుషారుగా ఉన్న, నాకు అక్కర్లేదు, నేనేమి అడగను. ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... నన్ను మన్నించు!! నాకు అన్నీ తెలియాలి. అందుకే, నేను ప్రతీదీ అడుగుతాను!!

Tuesday, May 27, 2008

అంతులేని ప్రయాణం

నడిచే కాలం పయనించాల్సింది ఎంతో ఉంది

కనుచూపుమేరలో కూడా నీవు లేవు

నిన్ను అందుకోలేనని తెలుసు

అయినా నా ప్రయాణం సాగుతుంది

నిన్ను చేరుకోగలనని కాదు చెలియా!

నీ జ్ఞ్యాపకాలు వెంటాడుతున్నయని!!

Saturday, March 29, 2008

ఒంటరి

పంచేకొద్ది పెరిగేది ప్రేమ ఐతే
పదింతలు అయ్యేది సంతోషం
సగానికి తరిగేది బాధైతే
మనసున్న మనిషికి మిగిలేది రగిలే నిన్నలే!!
ప్రేమను ఏనాడో అంకితం చేసిన నా
జీవితంలో మెరుపులా మెరిసింది ఓ ప్రత్యూషం!
నిద్రిస్తున్న నా మనసును మేల్కొల్పి
తీయని కలలను పంచింది.
విధిని ఎదురించలేని ఆ కాలం ఈదురుగాలిలా
మారి నా కలల దీపాన్ని ఆర్పేసింది.
ఎన్నొ మలపులు తిరుగుతున్న జీవితంలో
నీ ఎడబాటు ఉప్పెనగా మారి నా సంతొషాన్ని ముంచేసింది!
అందరి మధ్యన నువ్వుండి నన్ను
మరచి కొత్త మార్పుని వెతుక్కున్నావు!
ఎందరు వున్న నిను చేరలేక
నీ ఆలొచన నన్ను వీడక వెంటాడినావు!!
నేడు నువ్వు నన్ను పూర్తిగా మరిచావు
నేను మాత్రం పూర్తిగ నువ్వయ్యను!!
నీవైన నేను కూడా క్రొత్త మార్పును స్వాగతించాను
నిన్ను తలచి తలచి ఇంక మరువదలచాను.
కొత్త బంధాలను పెనవేసుకుంటూ
పాత మనుషులను వెతుక్కుంటూ
చేదు ఙ్ఞ్యాపకాలను మరచిపోతూ
నవ జీవనానికి నాంది పలికాను!
ఈ లోకాన్ని కొత్త కోణంతో చూస్తున్నాను
మరల మార్గాలను అన్వేషిస్తున్నాను
నా గతాన్ని తుదిపివేయలేక, నేటిని
రంగవల్లులతో అలంకరిస్తున్నాను..
అడుగు ముందుకు వేస్తూ కాలానుగుణంగా
సర్దుకుపోతున్న నాకు ఓ రోజు ఎదురైంది!
ఆ రోజే నాకు తెలిపింది, నీ ప్రేమ
సాక్షిగా ఏదొ శాపం నన్ను వెంటాడుతుందని!!
అందరు నా వాళ్ళే అనుకున్నా,
ఎవ్వరికి ఏమి కాలేక
నాకంటూ ఏమి లేదని, ఏది ఉండదని,
ఒంటరినని తెలుసుకున్నను!
మళ్ళీ నువ్వెళ్ళే దారిలోనే నీ తోడు కోసం వేచియున్నా!!

కలవరింత

నగరమంతా నిదురోయే ఈ నడిరేయిలో
నీ ఙ్ఞ్యాపకాలు నన్ను పదే పదే తట్టి లేపుతున్నాయి!
ఆరు బయట వీస్తున్న చల్ల గాలులు నన్ను
ఓదారుస్తున్నప్పటికి నా మనసు నీ తీయని
పలకరింపునే కోరుకుంటుంది! ఎన్నటికీ
నిను చేరలేనని తెలిసినా మాట వినని నా
మనసుని నువ్వైనా ఓ సారి బుజ్జగించలేవా?
ఈ నిశీధిలో ప్రత్యుషంలా రాలేవా??!!??

చిన్న విన్నపం!

రగిలే ఈ చీకటికి కరిగిపోతున్న నా జీవితంలో
నీ ఙ్ఞ్యాపకాలను మరువలేక నా మనసు వేదన పడుతుంది.
నీ చూపుతోనే చూసే నా కనులు
ఇకపై లోకాన్ని చూడలేక రెప్పలు వాలిస్తే
నా ఆలొచనలను ఆక్రమించే నీ గురించిన ఊహలు
నిన్నే తలుస్తూ నన్ను పూర్తిగా మరిచాయి!!
నీవు పలికే ప్రతీ మాటకు రాగం కట్టిన నా
గుండె నేడు నీ విరహాగ్నిలో నిన్నే
తలచుకుంటూ మూగబోయింది! తెలిసిన వాళ్ళు
ఎందరు వున్న నీవు లేక ఒంటరినై ఈ లోకంతో
పోరాడుతూ అందరికి అపరిచితుడనయ్యాను.
మనస్సులో మాత్రమే నన్ను నిలుపుకున్న నీకు
నా మది అక్షరముఖంగా చెబుతుంది!
నీకోసమే నేను అనేది నిజమైతే... నీ
పెదవిపై చెరగని చిరునవ్వుని అవుతాను...
నా దానివిగా నా జీవితాన్ని పంచుకో...
లేదా ఎడబాటుగా మారి నా ప్రాణం తీసుకో...
కాని కదలని శిలగా మాత్రం నన్ను మార్చకు!!

మరువలేను

ఓ మనసా! ఎన్నళ్ళనీ ఈ ఆవేదన
తనకోసం ఎందుకింత తపన!
నిన్ను నాకు ఎంత దూరం చేసిన
ఎన్నటికి ఆగని నీ తపస్సు తనని చేరునా!!
నీ పొడపడని తన కోసం నీ
విరహాన్నిఆలపించిన, వెనక్కి మళ్ళని ఈ కాలం
నిన్ను తన దరికి చేర్చుతుందని కొత్త
ఆశతో నీ ఉనికిని కానుక చేసావు!!
ప్రేమను ఇవ్వడమే తెలిసిన నువ్వు
ప్రేమను కోరడం, అలలై ఉవ్వెత్తునలేచి తీరం
తాకే నీ కన్నీటి చిరునామాను
చెప్పకనే చెబుతున్నాయి!!
తెలుసుకోమ్మని కాలం బుజ్జగిస్తున్న వినని
నువ్వు తన సంతోషమే నీ ఊపిరిగా భావిస్తే
మరో బంధంలొ అడుగిడుతున్న తనకి
ప్రేమని మాత్రమే మిగుల్చు, రగిలే నిప్పు
కణాల్ని నీలోనే ఆవిరి చేసి తన కోసం
పూవులై కురిపించు!
మరో తోడు తన ప్రేమ మందిరంలో తీయని
ఆనందాన్ని పంచాలని ఆశించు!
ఓ మనసా! ఈ జన్మకింతేనని త్వరగా
తెలుసుకో! ఆమెను మరిచిపో!!

Tuesday, March 11, 2008

పరిచయం

ఎన్నో ఊసులను తనలో దాచుకున్న నా
మనసు నీ చిన్ని ఎడబాటుతో ఒంటరిగా మారింది.
గుండెను పిండే ఈ భారాన్ని నేనొక్కడినే మోస్తున్న,
కూలబడ్ద ప్రతీసారీ నీ చిరునవ్వుల జ్ఞాపకాలతో
అడుగులు వేస్తూ కాలంతో పయనిస్తున్న!
నిన్నటి నీ చెలిమి నేడు ముసురు పట్టి
ప్రతీరొజు నను తడిపి వెళ్తుంటే, పరిచయమైన
ఈ కన్నీరు వరదలా నన్ను ముంచి వేస్తుంది!
కూలిన తన ఆశల సౌధాల వద్ద విలపిస్తూ
అలిసిన నా మనసు దొసిలి ప్రేమను
అందిస్తావని ఊహలకు సాక్ష్యం ఇస్తుంది.
వాడిన కలలను చూస్తూ సోలిపోతున్న నా
కనురెప్పలు కొత్త చిగురువై వస్తావని
ప్రతీ రెమ్మకు ఆశలు రేపుతుంది.
తెలిసిన నిన్న ఎదురై, నన్ను పరాయివాడివంటుంటే
తెలియని కాలం నన్ను, నీవెవరని బాధిస్తునా
జవాబు లేక నీ పేరే పలుకుతున్న నా
గతం నాలోనే ఉన్న నీకు చేస్తున్న
విన్నపం! నిన్నని వదిలి వెళ్ళని నువ్వు
నన్ను నాకప్పగించి నేటిని పరిచయం
చేసి వెళ్ళు! రేపటి ప్రత్యుషని క్రొత్త
కాంతితో నింపి ఆహ్వానిస్తాను...
ఏనాటికైన నిను చేరుకోగలనని....

Saturday, February 23, 2008

ప్రేమాగ్ని

జాబిలీ కన్నా అందమైన దానివని
నిను చేర వచిన నాకు నీ హృదయ
పాశాణాన్ని చూపావు! కోకిల
పలుకులని పలకరించిన నన్ను ఎందుకని
తూలనాడావు ? నా తప్పుని నీ నేరముగా
భావించి మన పరిచయానికి అడ్డుగా
మౌనాన్ని ఎందుకు నాటావు?
నీవెందుకిలా మారావు? నన్నెందుకు
దూరమ్ చేసావు? మాధురమైన ప్రేమలో
ధీర్గమైన ఘడియలా సాగుతూ నా మదికి
రంపపు కోతను మిగిల్చావు కదా! చివరి సారిగా
నీవు అందించిన ప్రేమను నీకే అంకితమివ్వాలని,
మనమిద్దరం గడిపిన క్శణాలను నీ సమక్షం లో నే
హృదయాగ్నకి ఆహుతి ఇవ్వాలని తలచిన నాకు
ఒకింత సాయం చేస్తావా?
ఆ సాయంలో తోడు నిలుస్తావా?
బదులిమ్మని నీ మౌనాన్నిబతిమాలినా
జవాబు లేదని జాబు పంపిన నీ చూపులు
నా గుండెలో శులాలై దిగాబడగా,
తిరిగిన నా కళ్ళల్లో సుడులు నీకు
బదులిచ్చినా మారని నీ మనసు కోసమ్
నేను ఒంటరిగానే ఆరిపోతున్న!
ఈ గాలిలో కలిసిపోతున్నా!!

Friday, February 22, 2008

క్షమించు ప్రియా

ప్రియతామా ... !
కట్టలు తెంచుకుని నీ చెంపలపై నుండి జారే
కన్నీటిని నేనేమని అడిగేది?
గుండె నిండా దాచుకున్న తలపులు
ఒక్కసారిగా రేపిన ప్రకంపనాలతో
కొట్టుమిట్టాడుతున్న నీ మదినేమని అడిగేది
మాటలతో తూటాల వర్షం కురుస్తున్న
మౌనాన్నివీడక నీకున్న ప్రేమను
వ్యక్తపరిచిన నీ పెదవులనేమని అడిగేది
కాలం పయనిస్తూ మిగిల్చిన ఈ ఎడబాటుని
లెక్కచేయక మరచిపోతూనె నన్ను తలచుకుంటున్న
నీ మనసునేమని నేను అదిగేది?
బదులు రాక నీ జాబు కోసమ్ ఎదురు చూడలేక
చీకాటిని చీల్చుకుంటూ వచ్చే ప్రతి ఉష కు విన్నవించుకుంటున్న నా మనవి ...
తెలిసి చేసినదో తెలియక జరిగినదొ, నా వలన నీకు
ఎటువంటి తాపము కలిగిన, నన్ను క్షమించు ప్రియా . . . !!!
మన్నిస్తావు కదూ . . .

Wednesday, February 20, 2008

నేను ప్రేమించాను

ప్రేమించాను ... అవును ... నేను ప్రేమించాను ప్రేమ అంటే తెలీని నేను నిన్ను గాఢంగా ప్రేమించాను మనస్సుతో మాత్రమే స్ప్రుసించే మనస్సుని నీకే సమర్పించాను అవును... నేను ప్రేమించాను చిరుగాలికి గింగురులు తిరిగే నీ ముంగురులను ప్రేమించాను తడి ఆరిన నీ కురులలో చిక్కులను ప్రేమించాను మోచేయి దాటి నీ నడుము పై నాట్యం చేసే నీ జడను ప్రేమించాను నీ నుదుటి పై తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆ తిలకాన్ని ప్రేమించాను అర్థ చంద్రాకారంతో నీ కనుల అందాలనూ ఇనుమడింప చేసే ఆ కనుబోమాలను ప్రేమించాను
అందమైన నీ కనులను సైతం అమితంగా ప్రేమించాను అవును ... నేను ప్రేమించాను ఒర కంటి తో వాలు చూపును విసిరే నీ కనులను ప్రేమించాను ఆ కనులను కప్పె రెప్పలను ప్రేమించాను ఆ రెప్పల మాటున కనుపాపలలో పసిడి కాంతులను ప్రేమించాను అవును... నేను ప్రేమించాను నీ చిలక ముక్కుని ప్రేమించాను, అందమైన ఆ పుదకాని ప్రేమించాను దాని సోయాగాన్ని ప్రేమించాను, దాగి ఉన్న పొగరుని ప్రేమించాను అవును ... నేను ప్రేమించాను బుట్టలు వ్రేలాడే నీ చెవులను ప్రేమించాను, వాటి సున్నీతత్వాన్ని ప్రేమించాను
నీ చెవులకున్న తాపాన్ని సైతం ప్రేమించాను, అవును... నేను ప్రేమించాను కవులు సైతం వార్ణించని నీ అందమైన పెదవులను ప్రేమించాను రేగిన అలజడికి ఆదిరేటి పెదవుల్ని ప్రేమించాను గులాబీ రంగుని పోలిన నీ ఆదరాల్ని ప్రేమించాను
మునిపంటి క్రింద నాలిగే చిన్ని పెదవిని ప్రేమించాను
అందమైన నీ చిరునవ్వుని కూడా ప్రేమించాను
అవును... నేను ప్రేమించాను
సిగ్గుతో ఏరుపెక్కిన నీ చెంపలను ప్రేమించాను
తామరాకు పై నిలవని నీటి బొట్టుల ఉండే నీ బుగ్గలను ప్రేమించాను
ముద్దు పెట్టె కొద్ది జారిపోయే నా పెదవులకు నేర్పిన కొత్త ఆటను ప్రేమించాను
అవును... నేను ప్రేమించాను
నా ముద్దుని స్వీకరించిన నీ చిన్ని గడ్డాన్ని ప్రేమించాను
వీణ తీగ వంటి నీ పొడవాటి మెడను ప్రేమించాను
నీ మెడను అలంకరించిన అభరణ అదృష్ఠాన్ని కూడా ప్రేమించాను
అవును ... నేను ప్రేమించాను
నీలో అణువణువూ ప్రేమించాను, అనువణువునూ ప్రేమించాను
ఆపాదమస్తాకం ప్రేమించాను, నీ హస్తాలలో పుస్తకాన్ని ప్రేమించాను
నీ సన్నని నడుముని ప్రేమించాను, నీ అందమైన కరములను ప్రేమించాను
నీ చేతి గాజులను ప్రేమించాను, నీ కాళ్ళ పట్టీలాను ప్రేమించాను
నీ జడలో మల్లెలను ప్రేమించాను, నీవు ఉన్న చోట వ్యాపించే పరిమళాన్ని ప్రేమించాను
నీ జడలో మల్లెలను ప్రేమించాను, నీవు ఉన్న చోట వ్యాపించే పరిమళాన్ని ప్రేమించాను
నీ చూపుని ప్రేమించాను, తేనె పలుకుల్ని ప్రేమించాను
నీ శ్వాసను ప్రేమించాను, ఆశను ప్రేమించాను
నీ మనసు చెప్పే ఊసులను ప్రేమించాను, నీ చెవులు వినే మాటలను ప్రేమించాను
నీ నడతని ప్రేమించాను, నడక ని ప్రేమించాను
మెరుపులీనూతున్న నీ మేని ఛాయను ప్రేమించాను
అన్నింటా నిను ప్రేమించాను, అంతటా నేను ప్రేమించాను
అవును... నేను ప్రేమించాను
ఆనాడు, అస్తమిస్తున్న సూర్యుడు నా జీవితంలో
వెలిగించిన ఈ ప్రత్యూషని నేను ప్రేమించాను
అవును ... నేను ప్రేమించాను
ఎంతగానో ప్రేమించాను ... ప్రేమిస్తూనే ఉన్నాను ...
ప్రేమిస్తూనే ఉంటాను ...
నీ ప్రేమకై ... నేను

Tuesday, February 19, 2008

అరుదైన కానుక

నీ పలుకులతో నన్ను కరిగించి

నువ్వు మాత్రం ఎందుకిలా మారావు?

కొండంత మమతను మదిలో దాచి

నా ప్రేమను ఎందుకని కుదించావు?

విరగబూసిన వెన్నెల పూవులతో

ఒక్కసారిగా నిశీధిలోకి నన్ను నేట్టేసావు

అమృతం పంచి నాకు చితిని పెర్చావు

నీ కోపం నా మదిని పక్కదారి పట్టిస్తే

నా ప్రాణం కూడా దారిమల్లదా? ప్రేమ

బీజం నాటి నీవు ద్వేషం పూయిస్తున్న నా

గద్గగా భావనలు ఇంకా ప్రేమాక్షరాలనే

కురిపిస్తున్నాయి... ఇంకా ఎన్నాళ్ళు

కురుస్తాయో !! ఒక్కొక్కోటి గా నువ్వు

పెకిలిస్తున్నా చివరి దాక నీకు నా

మది ఈ ప్రేమాక్షరాలనే సమర్పిస్తుంది

అరుదైన కానుకగా, మనసుతోనే స్పృసించే పరవశం...

నీ ప్రేమ

ప్రేమ . . . ప్రేమ . . . ప్రేమ . . .ప్రేమ . . . ఇదొక అందమైన పదం అంతకు మించి ఒక అందమైన అనుభవం. ఆది కేవలం పొందడం లో కాదు, ఇవ్వడంలోనూ ఉంది, ఇవ్వడంలోనూ ఉంది. ప్రేమ . . . కొందరికి మాత్రమే దక్కే వరం వారి ఆనందానికి ఆ అంబరమే హద్దు మనసుని మాయ చేసేది ప్రేమ, ఎన్నో భావనలకుజన్మనిచ్చేది ఈ ప్రేమ. చిక్కబడ్డ కటిక చీకటి ని సైతం వెలుగుతో నింపేది ప్రేమ, గుండె నిండా పేరుకున్న కొండంత బాధను కరిగించేది ప్రేమ. నా కళ్ళలో కోటి కాంతులను నింపింది ప్రేమ, మాటలు రాని నా మౌనానికి కవితలు నేర్పింది ఈ ప్రేమ. ఇష్టం అంటే తెలీని నాకు నిన్ను ప్రేమించేలా చేసింది ప్రేమ, నిన్ను ప్రేమించన నేను, నన్ను నేను మరిచేలా చేసింది ఈ ప్రేమ. కళ్ళలో కనిపించేది మాత్రమే కాదు ప్రేమ, మనస్సుతో స్పృసిస్తే కలిగే పారవశ్యమె ఈ ప్రేమ. నీ కోసం తపన పడేలా చేసింది నా ప్రేమ నా కోసం కన్నీరు సైతం రాల్చావు అదే ప్రేమ. ఒక్క ఘడియైనను నా తలపుల నుండి నీవు వీడలేదు, ఇది నా ప్రేమనీ మనసు నిండా నా తలపులతోనే నింపావు, ఇదే నిజమైన ప్రేమ. నా ప్రేమను నీకు అంకితమిచ్చాను, ఇది నా ప్రేమ, నీ మనసుని నాకు అర్పించావు, ఇదే నిజమైన ప్రేమ, నీదే నిజమైన్ ప్రేమ. రగిలే మంటల్లో చల్లని జాబిలి నీ ప్రేమ నిశీధి లో ఓ ప్రత్యుషం నీ ప్రేమ ఉరకలెత్తే అలలకు తీరం నీ ప్రేమ మౌనం లో పలకరింపు నీ ప్రేమ కురిసే మంచులోనూ పరిమళించే పువ్వు నీ ప్రేమ తెల్లవరుఝాము పక్షుల రాగాలు నీ ప్రేమ గల గల పారుతున్న నదిలో సంగీతం నీ ప్రేమ ప్రేమ మాత్రమే నిండిన తీయని పలకరింపు, నీ ప్రేమ.
ఈ, నీ ప్రేమ, నాకు మాత్రమే దక్కాలని సదా ఆశిస్తూ . .
నా జీవితాన్ని నీకు అంకితమిస్తున్నాను . . .

Sunday, January 13, 2008

సంకురాతిరి సంబరం

వచ్చింది.

సంక్రాంతి వచ్చేసింది.

సంతోషాన్ని తెచ్చింది...

కోటి వర్చస్సుల వెలుగుని తెచ్చింది...

తెల్లవారనే లేవాలి!

తలంటు పోయాలి!!

కొత్త బట్టలు వేయాలి!

వీధిలో ఆడపిల్లల ముగ్గులు చూడాలి!

ముగ్గుల్లో అడుగులు వేస్తూ వారితో అల్లరి చేస్తూ దాటిపోవాలి!!

ముగ్గుల్లో రంగవల్‌లులు తిలకించాలి!

వాటి మధ్యలో గొబ్బిల్ళు చూడాలి!!

రేగి పండ్లు తినాలి!

పూలు అందించాలి!!

గుడికి వెళ్ళాలి!

ఈ రోజు దేముడిని చూడాలి!

చూస్తే జన్మ తరిస్తుంది.

చేతులెత్తి మొక్కాలి!

మనసు పులకిస్తుంది !!

పట్టుపరికిణిలొ తరుణి ని చూడాలి!

తేరిపార చూడాలి! మాట కలపాలి!!

కనులు కలవాలి! ప్రసాదం పంచె వేళా చేయితాకాలి !!

ఆకాశంలో విహరిస్తున్న మనసుని అరచేతిలో దాచిపెట్టి

ఊరందరికి పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఇంటికి వచ్చి అల్లరి చేయాలి!

అటుపిమ్మట వాయిడ్లి

పసందుగా మాగాయీ పచ్చడి!

వేడి వేడి అట్లు,

ఘాటుగా అల్లం చెట్నీ!

అంగట్లో కాలే రుచులు

మొక్కజొన్న అన్నంలో పులుసు

చిక్కని మజ్జిగ వంపులు

కడుపు నిండా జూర్రతాలు

వెళ్ళాలి వెళ్ళాలి

వెళ్ళి త్వరగా ఆడుకోవాలి

ఎగిరే గాలి పటాలు

గొంతు చించుకునే ఉల్లాసం

ఆట లో తెగిన పఠాంగులు

పరిగెత్తే పిల్లలు

"శంకు రాతిరి సంబరం"

పాత బాగుంది

పిల్లలు ఆడుకున్టున్నారు

వలస పక్షుల్లా ఆకాశం లో ఎగీరుతున్న గాలిపటాలు

కృష్ణ గోదావరి వరదల పెరుగుతున్న జనాలు పాటలకు లోటు లేదు

అరుపులకు లోటు లేదు

సై అంటే సై వేయి అంటే వేయి

తెగుతున్నమాంజాలు

వీధులు దాటి ఆకాసమే హద్దుగా పటాలు

నది నెత్తి పై సూరీడు

ఆటాలన్ని చూస్తున్నాడు పాటలన్నీ వింటున్నాడు..

గుమ్మమ్మూందు హరిదాసు..

కమ్మని కీర్తనలు

పొగిడే పద్యాలు

బస్తాలు కొలిచిస్తున్న యజమానులు

సంతోషం ఆపుకోలేక ఆశీర్వాచనాలు

స్వామి ఉరేగింపు

పళ్ళకి మోత

వెనక వాయిద్య కారులు

పరవశించిన జనం

తన్మయులైన జనం

స్వామిని చూశాను

దేవుని చూశాను

ఆనందంలో మైమరీచాను

పళ్ళకి ఆగింది

స్వామి ఆగాడు..

స్వామి ముఖం చూశాను

నమ్రతతో నమస్కారం

అడుగు ముందుకేసాను

ఆగలేక పరిగెత్తాను

భక్తి తో చేయి ముందు సాచి ఆయన్ని తాకాను

స్వామిని తాకాను

తనువు పులకరించింది

ఆనందం అవధులు దాటింది

ఉద్వేగం కరిగిపోయింది

భక్తి ధార కట్టింది

స్వామి వెళ్ళిపోతున్నాడు

కళ్ళు తుడుచుక చూశాను

ఆయన వశీకరణ లో బంధీనైనాను

నా జన్మ ఫలించింది

ఆనందం చూశాను

తృప్తి కలిగింది

జన్మ ధన్యమైంది

మనస్సులో కొత్త బీజం నాటుకుంది.