Monday, March 22, 2010

ఒంటరి మాను

నన్నింకా ప్రేమిస్తున్నావనే తలంపుతో ఉంటే
అది భ్రమ అని తేలికగా కొట్టిపడేస్తావు

నీ ఆప్యాయతని స్పృశించాలనుకున్నప్పుడల్లా
నీ ఆస్మిత ప్రవర్తనతో నన్ను గెంటేస్తావు

నాలోకి నువ్వు చొప్పించిన ప్రతీ భావోద్వేగము
నీ ఙ్యాపకాల చితి మంటల్లో కాలిపోయాక
నాకంటు ఇక మిగిలిందేముందని వొంటిగా
ఏకాంత ఆలోచనలలో లోతుగా మునిగిపోతాను...

Saturday, March 20, 2010

నే రాసే ప్రతీ పదంలో
నిన్ను వెతుక్కునేదానివి
ఇప్పుడేమో, నే రాసేది నీ
కొసమే అని తెలిసినా
నిను చేరనివ్వడం లేదు
నా ఆవేదనని

**********

ఒక్కోసారి కోపమొస్తుంది
ఏం చెయను! వ్యసనంగ
అల్లుకున్న నిన్ను వదులుకోడం
కష్టమే మరి నాకు!

**********

మనసు మార్చుకున్నావని
అనుకున్నాను గాని
మనిషివే మారిపోతావనుకోలేదు

Thursday, March 18, 2010


కళ్ళ కొసల్లో వేలాడే
భాష్పాలు చారికలుగా అంటుకుపోయేది
చితికిన మనసు నెర్ర
నెర్రలుగా చెక్కుకుని మూలుగుతుండేది

రవ్వంత ప్రేమతునక
ఎదురుగా వేలాడితే చాలు
ఛిద్రమైన గుండె తన
ఒడిని ఒళ్ళంత పరిచేది

ఆశలొదిలేసిన ఈ హృదయం
అప్పుడప్పుడు ఊపిరివేళ్ళను
తడుపుతూ బతుకునీడుస్తుండేది
సరిగ్గా అప్పుడే-

ఒక్కొక్కటిగా రాలుతున్న శిశిరంపై
వెచ్చని వసంతంలా పరుచుకున్నావు
లాలిత్యం ఆశించని బతుకుకి
లాలిపాటని అందించావు

కూలబడిన ప్రతీచోటాల్లా
నడక వీడిన ఆ దారంటా
నడి వేడిమిలో పూలు పరిచావు
సడి రాతిరిలో జాబిలివయ్యావు
వడి వడిగా వెన్నెల గుత్తులై
నా జీవితంలో విరబూసావు

ఆశల లతని పాదు చేస్తూ
అనుక్షణం నన్నల్లుకుపోతు
మంచు తుషారమై కురిసావు

నీ ప్రేమ సముద్రమని తలచి
జోగాడే పడవనై ఒదిగిపోయాను
ఆత్మీయత పంచుతూ సుతారంగ
నా మనసు మీటుతుంటే కమ్మని
వీణ పాటై కరిగిపోయాను

పంచుకున్న కలలు కల్లలని
కాలం వాటిని రక్కిపోతుందని
ఒకదానితో ఒకటి పెనవేసుకున్న
మనసులను అమాంతంగా నువ్వు
విడదీస్తే, తట్టుకోలేని నా చిన్ని
గుండె నెత్తుటి జడులు విదుల్చుతుంది

ప్రేమని చంపి స్నేహితులమని
మనసుని మాయ చేయడం నీకు
తగునేమో, అయినా -
స్నేహమాంటే ఇష్టమని
ఇష్టమంటే ప్రేమని
ప్రేమంటే నువ్వని
నువ్వంటే ప్రాణమని
నీకు చెబుదామనుకున్నాను
కాని -
నీ సమక్షంలోనే నువ్వు
అలక్ష్యం చేస్తుంటే నా
యద కవాటాలు చెల్లా-
చెదురుగా గాల్లోనే చీలిక
పీలికలై పిడచకట్టుకుపోయాయి

బీడు గుండెని నిమరలేని
మొండి చెయ్యిగా, శాశ్వతంగా
మిగిలిపోయావు నా పట్ల

Tuesday, March 16, 2010

నిరీక్షణ

రాత్రులు కరిగిపోతాయి
పగలు గడిచిపోతాయి
నిద్దుర బరువుని నా
కనురెప్పలు అలవాటుగా
మోసేస్తాయి! ఎప్పుడైనా
నువ్వొస్తావని, రేయంతా
నీకోసం ఎదురుచుస్తానని,
నీకు తెలుసా!

నెమ్మదిగా సాగే మేఘంలా
మందితో గూడి వచ్చి ఆటల్లో
మునిగిపోతావు. అలా
మాటుగానైనా నిను చుసి
మురిసిపోతాను కాని,
ఎందుకనో కంటి చివర
తడి ఇబ్బంది పెడుతుంది!!

నిన్ను చూసిన ఆనందం కంటే
కినుకు వహించే నీ మనసే
నన్ను కష్టపెడుతుందేమో!

అయిన -
నీ పలకరింపుకోసం
పడిగాపులుకాస్తుంటానని
నీకు తేలుసా!!

Wednesday, March 10, 2010

చివరి మెట్టు

నీ మాటలే ఎప్పుడు
నడిపిస్తుండేవి
నా మనసుకి అవే
ప్రాణాధారం మరి

*****

ఆవల నీ ప్రపంచంలో
నవ్వులు పూయిస్తుంటావు
నా పెదవులపై
ఎందుకనో వాలవు

*****

నాకు పశ్చిమాన నువ్వు
నీకు తూర్పున నేను
మన మనసుల మధ్య
ఏర్పడిన అగాధం

*****

ఇంకిన కన్నీటికి
విలువ తరిగిపోయింది
మోడువారిన ఆత్మ
కాలాన్ని శాసిస్తుంది...

Thursday, March 4, 2010

I MISS U

నేను అందరి మధ్యనే ఉంటాను, కానీ
ఏదో శూన్యం వేటాడుతుంది నన్ను,

అందరి అభిమానం పొందుతున్నాను, కానీ
నువ్వు చూపించిన తీరు వెంటాడుతుంది నన్ను,

కబుర్లెన్నో ఆలకిస్తుంటాను, కానీ
ఎవరి మాటలు నా చెవిని చేరవెందుకో,

నాకంటు లేనిది ఏదో తెలీదు, కానీ
నే కోరేది ఎల్లప్పుడూ నీ స్నేహమే!
అందుకేనేమో,

నీ వెలితితో నేనిప్పటికీ
అసంపూర్ణంగానే మిగిలిపోయాను

Wednesday, March 3, 2010

ప్రణవి

నడిరేతిరి గాలుల్లొ నెమ్మదిగ ఒదిగిన క్షణాలు
తరగని దూరాలతో బరువుగా నిట్టూర్పులు విదుల్చుతున్నాయి

ఎదలోతులోకి ఎగబాకిన నల్లటి చీకటి
ఇక రాకు అంటూ నన్ను వెనక్కి నెట్టివేస్తున్నాయి

బాధ్యత నిండిన కనురెప్పల చప్పుళ్ళు
బంధం తుంచుకోమని ఆదేశిస్తున్నాయి

దూరాన తళుక్కుమంటూ మురిపించిన మాటలు
సంద్రపు హోరులో వెతుక్కోమంటూ మౌనం వహిస్తున్నాయి

చెరిగిన దూరాలు నా దారిని కలిపేలోపు
ఎన్నెన్నో యోజనాల ఆవలికి ఎగిరిపోయావు

విసిగిన మనసు తూటాలుగా నిన్ను పొడించిందేమో
నువు అల్లిన పరదాలు నా దారినిండా కమ్ముకున్నాయి

ఒత్తిళ్ళల్లో ఒదిగిన తపన తమాయించుకుంటూ
ఒంటరి క్షణాలతో కూడి ప్రణవ నాదం చేస్తున్నాను
ఎవరికి వినిపించకుండ రోదిస్తున్నాను!!