Friday, May 8, 2009

పయనం.. ఒంటరి పయనం


కాల చక్రం..
నజ్జవుతున్న బ్రతుకు దొంతరలు ..
పులిమిన కృత్రిమ నవ్వులు
అడుగు జాడల్లెని అడవి
చీకటి, గడిపిన ఆ కొద్ది క్షణాల భారాన్నీ
మోసుకుంటూ.. కాళ్ళీడుస్తూ..
ఒంటరి పయనం...
సుడిగాలిలా..
అంతరాళాల్లోనించి
ఆలోచనల్లో బహిర్గతమవుతావు
ప్రతి పలకరింపూ ఓ తీయని వేటు ..
గుండె ముక్కలు పొదివి పట్టుకుని
ఓ అజ్ఞాతగా.. నన్ను
మోసం చేసుకుంటూ.. తడబడుతూ..
గమ్యమెరుగని ప్రయాణం
మరచాననుకుంటూ..ఏమరుచుకుంటూ..
అలలా వీడలేక.. కలలా మిగలలేక..
బ్రతుకీడుస్తూ..
పయనం.. ఒంటరి పయనం !
Note : నే వ్రాసిన వెళ్ళిపో నేస్తానికి తన స్పందన గా తన మాటలలో పదాలలో దానిని ఇంకొంచెం భావాన్ని అద్ది సున్నింతంగ స్పృశించి తనదైన శైలిలో మెరుగుపరిచి నాకందిచిన ఆత్రేయగారికి (http://aatreya-kavitalu.blogspot.com) ప్రత్యేక ధన్యవాదాలు.

Saturday, May 2, 2009

వెళ్ళిపో నేస్తమా

నిన్ను మర్చిపోయాను
యాంత్రిక జీవనంలో
బతుకు పోరాటం సాగిస్తూ
నీ జ్ఞ్యాపకాల దొంతరలను
అణిచివేసాను
కృత్రిమ నవ్వుల్ని పులుముకుని
ముఖస్తుతి మాటలు కలుపుతూ
అడుగు జాడల్లేని అడివిలో
ఒంటరిగా కబుర్లు చెబుతున్నా
నీతో గడిపింది
కొద్ది క్షణాలే అయినా
నాతో పాటు అవి
తోడుగా వస్తూనే ఉన్నాయి
ఏదో ప్రవాహం ఛుట్టుముడుతుంది
అలలతో పాటు అట్టడుగుకి వెళ్తావు
కడలి వలే పొంగుతూ
మరలా సుతిమెత్తగా తాకుతావు
ఏం చెప్పేది
నీ ఒక్కో పలకరింపు
నన్ను బాధించిన వైనం
నీ కన్నీరొలికినా
ఏమి చేయలేని చేతకానితనం!
వెళ్తూ వెళ్తూ
గుండెని సగం కోసి పోయావు
ఇంకో సగం మిగిలిందనా
నలిపేయడానికి తిరిగొచ్చావు?
నీ చాయలు నాపై
ఇకలేవని మొండిగా వాదిస్తానే కాని
అలా నన్ను నెను
మోసం చేసుకుంటున్నాను, తెలుసా?
నిజం చెప్పాలంటే
నిను మర్చిపోతున్నాననుకున్నాను
కాని, ఎంత ప్రయత్నించినా
నిను మర్చిపోలేకున్నాను !!

Saturday, February 14, 2009

ప్రేమికుల రోజు

కలల తివాచి ఇంకా మడవనే లేదు
నీ జ్ఙ్యాపకాలు ఇంకా మరుగున పడలేదు
నా మదిలో నీ మోము ఇంకా మసక బారలేదు
చెదిరిన గూడువైపు దారి మళ్ళిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నా కడకు!
చెమర్చిన కనులలో నీరు నింపుతు
నీ పెదవిపై నా పేరు నిలుపుకొంటు
మనకు కలిగిన గాయం గుర్తు చేసుకొంటు
చెదిరిన ఆశలవైపు వేలు చూపిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నీ కడకు!!
నీ ఏడబాటు నాకు అమూల్యమైనదని నీకు తెలుసా?
నా కనుల ముందు నువ్వు మెదిలే ప్రతీ సారి అది
నా మనశ్శాంతిని భగ్నం చేస్తుంది, అయినా
నిను తలుస్తు కాలానికి ఎదురీదడం నేర్పుతుంది!
బాధనిండిన రాత్రులలో ఒంటరిగా
చెరో ధ్రువం వైపు తడవడం ఎందుకు?
పిలిస్తే నీ కోసం దేనిని లెక్క చేయని
నాకోసం నువ్వు ఒక్కసారైనా వచ్చేయలేవా ??
ఈ ప్రేమికుల రోజు కలిసి జరుపుకొందాము!!

Monday, January 26, 2009

తిరిగొచ్చిన శిశిరం

మానుననే అనుకున్నాను
మోడువారిపోయి ఉన్నాను
ఆశల రెక్కలన్నీనేల రాలగా
జ్ఙ్యాపకంగా బరువుతో కృశించిపోతున్నాను.
తూరుపు తెలవారుతూండగా
లీలగా తాకిన ఏదో స్పందనగా
మనసత్వాలలో కొత్త వసంతంలా చేరి నిండిపోయావు.
నీ చిర్రుబుర్రు మాటలతో
అల్లరి కోపాలతో
గ్రీష్మమై నాకు ఊపిరి పోస్తు వచ్చావు
నీ ప్రతీ నవ్వు నాకు అందిస్తూ
ఆనందాన్ని రుచి చూపిస్తూ
శరదృతువై నా కన్నీటిని తుడిపేసావు
నన్ను నేను తెలుసుకోగా
నీకు నే దగ్గరవగా
నిన్ను నాలో దాచేయగా
హేమంతానివై పూర్తిగా ఒదిగిపోయావు.
నిన్ను నా చెంత చూసి
తారలన్ని చూపు తిప్పగా
రమణీయ రాగాలలో
నీ కబుర్లన్నీ ఆలకిస్తున్న వేళ
చిన్నబోయిన వెన్నెలంతా
నల్ల మబ్బు చాటు చేరి తుఫాను రేపింది.
కాలమంతా రెప్పపాటులో సాగిపోగా
మునుపటి ఏకాంతం మరల చేరగా
వెచ్చని నా కన్నీళ్ళు మంచుపొరని కరిగించగా
తిరిగొచ్చిన ఈ శిశిరంలో
చిగురించిన ఎడబాటుని నాకు జతచేసి
మరుపురాని జ్ఙ్యాపకంగా మిగిలిపోయి
నన్నొదిలిపోయావు!!