Sunday, September 20, 2015

స్వగతాలు #4

నీ ప్రతీ పలుకు
దాపరికాలు
అసత్యాలతో
కూని రాగాలు తీస్తుంది


తెలుసుకోలేని ఆ
బరువేదో నన్ను బాధిస్తూ ఉంది
నా కళ్ళను కాల్చే
నీ చేతలేవో
ప్రతి క్షణం వెంటాడుతూ ఉంది


కరుడు కట్టిన ఒకనాటి నీ ద్వేషం
నే ఓర్వలేని అనుభవాలను
చూపిస్తూ ఆనందిస్తుంది


ఊపిరి తిత్తులు ఎగిసిపడేలా
రోదనలు సాగుతున్నా
కరుణించమని అడగక
కాలాన్ని మరలమంటుందీ


నిప్పుల కొలిమిలో
నన్ను పడేసి
రగిలే మంటలలో
ఆజ్యం పోస్తున్నావూ


కణకణం దహించిపోతుంటే
నిస్సహాయంగా ఈ కంటి వెలుగు
పై పైకి కదులుతుంది
నెమ్మదిగా ఊపిరి నిద్రిస్తుంటే
ఆ ఉప్పనేదో ఉక్కిరిబిక్కిరిచేస్తుంది


చివరికేది మిగలని ఈ క్షణకాలంలో
నీవు చేయగలిగిందేముందని ఈ ఓదార్పు
నేనంటు మిగలని ఈ అస్తిత్వంలో
నా దరికెందుకని నీ అమరత్వం


చితికిన నా బతుకులో
రాలిన ఆ పువ్వులో
చెదురైన గుండె కోతలే
కదా మిగిలింది

స్వగతాలు #3

మనసుతో తాపిగా మాట్లాడి చాలా కాలమే అయ్యింది
యద తలుపు తట్టి కొన్నేళ్ళు గడిచినట్టు గుర్తు
కవితకి దూరమై, భావానికి బానిసై
మూగతనాన్ని అంటించుకుంటూ జడత్వంతో నింపేసినట్టున్నా...
లయ తప్పిన రాగమేదో తప్పుగా వినిపిస్తూంది
తడబడిన పలుకులేవో నిశ్శబ్దంలో కరిగిపోతున్నాయి
మసకబారిన కనులతో మరదీపం దగ్గర నేను..
వెలుతురుకావల ప్రపంచంలో కనిపించకుండా నువ్వు... !!

స్వగతాలు #2

కన్నీటి జడిలోనా నన్ను ముంచేస్తూ
వెతలన్ని లతగా కూర్చకే ప్రేమా..!!

రొప్పుతున్న గుండెలోన నిన్ను దాచలేక
కథలన్ని కవితగా నే రాసుకున్నా..!!

ఆలపించని రాగమొకటి విన్నవించవా
ఆలకించని గానమొకటి వినిపించనా..!!

నిశీధిలో తారలన్ని ఇసుకతిన్నె చేరగా
మరలిన హ్రుదయాలయాలు మెరుపులలో కలవగా...!!

స్వగతాలు #1

నా మౌనమే నాకు భారమౌతుంది
నోరు పెగుల్చుకురాలేని మాటకు
విలువ కట్టవని మూగబోయింది

ఈ వేదనంతా ఉప్పెనౌతుంది
నీకు అర్థం కాని ఈ బాధ
నాలోనె ఇమిడిపోతుంది ... 

నిన్ను ఒంటరిగా మిగిల్చినందుకు
కాలం నన్ను అనాధగా నిలబెడుతుంది..!!