నిండు పున్నమి అందంగా జారే వేళ,
నేలకి తాకే ఆనందంలో -
రివ్వున దూసుకువస్తున్న నీటి బిందువు
గాలి తిమ్మెరతో రమిస్తూ ఆవిరవుతూందెందుకని?
ఏవో ఊహల సమూహాల నడుమ -
అందంగా కదలాడే నువ్వు
నీ అందెల సవ్వడి నా హృదయానికి చేరేలోపు
స్వప్నంగా మిగిలిపోతావెందుకని?
నిదురలో లిప్తపాటు కలిగే ఈ ఆనందాన్ని
సాక్షాత్కరించలేక కంటిపాప కసురుతూంటే
ఆ విసురు నీకు చేరదేం!
నువ్వు మనస్సుకి మాత్రమే అందే భావానివా??
నిన్నెలా చిత్రించను!!
ఒళ్ళంతా తడిసిన బట్టలతో
క్రీగంట చూసే తరుణిలో నీ అందాన్ని చూడనా!
పలికే కోయిల గొంతుతో నీ కంఠానికి నునుపుతేనా!!
పురివిప్పె నడయాడే నెమలి
వయ్యరాన్ని తెచ్చి, నేను ముద్రించనా!
మంచు తెరల చాటున -
అరువు తెచ్చిన రవి కుంచెతో,
కదిలే సీతాకోకచిలుకలోని రంగులన్ని అద్ది,
లాలిత్య రేఖలతో నిన్నూహించనా!!